

అచ్చంపేట నియోజకవర్గాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం అచ్చంపేటలో కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. అచ్చంపేటను దత్తత తీసుకోవాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ కోరాల్సిన అవసరం లేదని, తాను ఈ గడ్డపై పుట్టిన బిడ్డనని, ఇక్కడి ప్రజల బిడ్డగా అభివృద్ధి బాధ్యత తీసుకుంటానని అన్నారు. ఉమామహేశ్వరం, మద్దిమడుగు, సలేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలతో పాటు శాతవాహనులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయులు తదితర రాజవంశాల పాలనతో అచ్చంపేటకు గొప్ప చారిత్రక నేపథ్యం ఉందని గుర్తుచేశారు. 14వ శతాబ్దంలో మాలిక్ కాఫర్ సేనలను ఎదుర్కొన్న అచ్చమాంబ వీరత్వాన్ని ప్రస్తావించారు. అచ్చంపేటతో పాటు పాలమూరు-రంగారెడ్డి, ఎస్సెల్బీసీ, డిండి, భీమా, జూరాల తదితర ప్రాజెక్టులను పూర్తి చేస్తానని ప్రకటించారు.
ఈ పర్యటనలో భాగంగా నాగర్కర్నూల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. రూ.274.32 కోట్లతో బీటీ రోడ్లు, రూ.29.65 కోట్లతో పెద్దకొత్తపల్లి, వెల్దండలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, రూ.25 కోట్లతో అచ్చంపేట పురపాలికలో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదులు, పురపాలికల్లో తాగునీరు, మౌలిక వసతుల కల్పన తదితర పనులు ఇందులో ఉన్నాయి. అమ్రాబాద్ మండలం మన్ననూరులో ఐటీడీఏ భవనం, ఆదివాసీ భవన నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ విగ్రహ నిర్మాణానికి భూమిపూజ చేశారు. సభలో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనర్సింహ, వాకిటి శ్రీహరి మహిళా సాధికారత, సాగునీటి ప్రాజెక్టులు, రైతుల సంక్షేమం, బీసీల అభ్యున్నతిపై మాట్లాడారు. అచ్చంపేట నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని నల్లమల ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ ముఖ్యమంత్రిని కోరారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!