

పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి విజయ పరంపర కొనసాగించాలని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ప్రజలు అందించిన విజయాన్ని రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని కోరారు. అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో పల్లా శ్రీనివాసరావు, నాదెండ్ల మనోహర్, పీవీఎన్ మాధవ్ మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో సాధించిన విజయంతో కూటమి ప్రభుత్వం మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుందని పల్లా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. పులివెందులలో తొలిసారిగా ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేశారని, గతంలో జరిగిన దుర్మార్గాలను అడ్డుకున్నామని ఆయన వ్యాఖ్యానించారు.
క్షేత్రస్థాయిలో మూడు పార్టీల మధ్య ఐక్యత, సమన్వయం కొనసాగుతున్నాయని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సమాజానికి సేవ చేయాలనే ఆసక్తి ఉన్న యువతకు స్థానిక ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని మూడు తుపాన్లు ముంచెత్తినప్పటికీ ప్రజలు కూటమికి స్పష్టమైన తీర్పు ఇచ్చారని పీవీఎన్ మాధవ్ అన్నారు. ప్రభుత్వ పాలన, అభివృద్ధి కార్యక్రమాలపై నమ్మకంతోనే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పనితీరును, అభివృద్ధిని పరిశీలించి పంచాయతీ ఎన్నికలతో పాటు రెండో దశ మున్సిపల్ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ముగ్గురు నేతలు ప్రజలను కోరారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఓటమి పాలైన కొన్ని చోట్ల సమన్వయ లోపం ఉందని పల్లా శ్రీనివాసరావు అంగీకరించారు. మూడు పార్టీల మధ్య సమన్వయంలో ఎక్కడ పొరపాట్లు జరిగాయో సమీక్షించుకుంటామని వెల్లడించారు. రాబోయే పంచాయతీ, రెండో దశ మున్సిపల్ ఎన్నికల్లో అలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తదుపరి ఎన్నికల్లో వంద శాతం ఫలితాలు సాధించడమే లక్ష్యంగా మూడు పార్టీలు పరస్పర సమన్వయంతో ముందుకు సాగుతాయని స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!