

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి గతంలో జారీ చేసిన జీవో 105కు సవరణలు చేస్తూ జీవో 153ను విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి మొత్తం 50 శాతానికి మించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ చేసిన సిఫార్సుల అమలుకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
గ్రామీణ స్థానిక సంస్థల వారీగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను చట్ట నిబంధనలకు అనుగుణంగా నిర్ణయించాలని స్పష్టం చేసింది. రిజర్వు చేసిన సీట్లు, పదవుల కేటాయింపు, రిజర్వేషన్ల రొటేషన్‌కు సంబంధించి ప్రత్యేక నిబంధనలను రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. జీవో 153 అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ కమిషనర్‌ను ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులకు కూడా ఉత్తర్వులు పంపించింది. ఈ మార్పులు రానున్న పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు మార్గదర్శకంగా నిలవనున్నాయి.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!