

ప్రజాభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి కార్మికుల సంక్షేమానికి సంబంధించి పలు కీలక ప్రకటనలు చేశారు. సంస్థ శాశ్వత ఉద్యోగులకు లాభాల్లో 34 శాతం చెల్లించడంతో పాటు కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 బోనస్ ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న 250–300 డిపెండెంట్ ఉద్యోగాల ఆర్డర్లను 15 రోజుల్లో పూర్తి చేసి అందజేయాలని తెలిపారు. కార్మికుల పేర్లకు సంబంధించిన సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించాలని, మెడికల్ ఇన్వాలిడేషన్ కేసుల కోసం ప్రతి ఏరియా ఆసుపత్రిలో నెలవారీ మెడికల్ బోర్డు సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. కరోనా లేదా ఇతర స్థానిక కారణాలతో ఉద్యోగాలు కోల్పోయిన అర్హులైన కార్మికులకు వన్‌టైమ్ ఆప్షన్ కింద తిరిగి ఉద్యోగాలు కల్పించే అంశాన్ని ప్రకటించారు. సింగరేణి భూముల్లో నివసిస్తున్న అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని వేగవంతం చేయాలని, జిల్లా కలెక్టర్లు, సింగరేణి అధికారుల కమిటీ నెల రోజుల్లో లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు.
కార్మికుల నివాసాలు, వైద్యం, విద్యుత్, విద్య, భద్రతకు సంబంధించిన సదుపాయాలను మెరుగుపరచడంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. శిథిలమైన డి-టైప్ క్వార్టర్ల స్థానంలో అన్ని వసతులతో కొత్త నివాస సముదాయాలను నిర్మించి నెహ్రూ హౌసింగ్ కాలనీలుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. సింగరేణి కాలనీల్లో డ్రైనేజీ, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్వహణ చేపట్టాలని తెలిపారు. ఏరియా ఆసుపత్రులను ఆధునీకరించి నిపుణులైన వైద్యులను నియమించడం, కార్డియాక్, క్యాథ్ ల్యాబ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం, సింగరేణి గ్రామాల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం వంటి చర్యలను ప్రకటించారు. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు, వినియోగంలో లేని భూములు, ఓబీ గుట్టలపై సోలార్ ప్లాంట్ల నిర్మాణం, ప్రతి ఆరు నెలలకు కార్మికులకు భద్రతా కిట్ల పంపిణీని సక్రమంగా చేపట్టాలని సూచించారు. భూపాలపల్లిలో వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి భూమి కేటాయింపు, సత్తుపల్లి, భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నిధులు, రామగుండంలో సింగరేణి ఆధ్వర్యంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు కూడా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్మికుల ఆదాయపన్నును సంస్థ నుంచే ప్రభుత్వానికి చెల్లించేలా, అర్హులైన సింగరేణి అధికారులకు పీఆర్‌పీ చెల్లించేలా యాజమాన్యానికి ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల సింగరేణికి నష్టం జరిగిందని భట్టి విక్రమార్క విమర్శించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!