

ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ సమతుల్య అభివృద్ధిని సాధించడంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేసిన మూడు ఎకనామిక్ రీజియన్ల అభివృద్ధి ప్రణాళికలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల పురోగతిపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో పోర్టులు, ఐటీ, డేటా సెంటర్లు, భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రాయలసీమలో సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, గ్రీన్ ఎనర్జీ రంగాలను ప్రోత్సహించనున్నారు. అమరావతి ప్రాంతంలో క్వాంటం టెక్నాలజీ, ఐటీ, లాజిస్టిక్స్, పోర్టు ఆధారిత పరిశ్రమలు, వ్యవసాయ విలువ ఆధారిత రంగాలను అభివృద్ధి చేయనున్నారు.
విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిధిలో మొత్తం 167 అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందించగా, ఇప్పటికే 64 పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతానికి ప్రధాన ఆకర్షణగా వైజాగ్ బే సిటీని అభివృద్ధి చేయనున్నారు. మధురవాడ, కాపులుప్పాడ, ఆనందపురం ప్రాంతాల్లో ఐటీ, డేటా సెంటర్ హబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. విశాఖలో స్టీల్ సిటీ, కాకినాడలో ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటుతో పాటు పోర్టుల విస్తరణకు చర్యలు చేపట్టనున్నారు. 15 నుంచి 20 కొత్త ఐటీ సంస్థలను ఆకర్షించి, ఇప్పటికే ఉన్న సంస్థల ద్వారా రెండు లక్షల ఉద్యోగ అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తిరుపతి ఎకనామిక్ రీజియన్‌లో ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, అంతరిక్ష, విమానయాన, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ, పర్యాటక రంగాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అమరావతి ఎకనామిక్ రీజియన్‌లో 48 ప్రధాన ప్రాజెక్టుల ద్వారా రూ.4.65 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కోనసీమ బ్యాక్‌వాటర్స్, అరకు, మారేడుమిల్లి ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!