

నీటి ప్రాజెక్టులపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు అవగాహన లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆయనకు ప్రాజెక్టులపై సరైన అవగాహన లేకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. పాలమూరు-రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులను నిరుపయోగంగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు రేవంత్ సర్కార్ లొంగిపోయిందని విమర్శించారు. నాగార్జునసాగర్ జలాశయం ఖాళీ అయితే నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీటి ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సొంత జిల్లాకే అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వ పనితీరుపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని హరీశ్ రావు పేర్కొన్నారు.
కృష్ణానదిపై ఏపీ ప్రభుత్వం ఇన్‌టేక్ వెల్ నిర్మిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరీశ్ రావు ఆరోపించారు. ఈ నిర్మాణం ద్వారా ఏపీ రోజుకు రెండు టీఎంసీల నీటిని తరలించుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర నీటి హక్కులను కాపాడటంపై దృష్టి పెట్టకుండా రేవంత్ ప్రభుత్వం కమీషన్లపైనే శ్రద్ధ చూపుతోందని విమర్శించారు. నీటి నిర్వహణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, తెలంగాణ నీటి హక్కులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీటి వినియోగం తక్కువగా జరిగిందని హరీశ్ రావు వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!