

స్థానిక సంస్థల ఎన్నికల్లో సరిగా పనిచేయని నియోజకవర్గ సమన్వయకర్తల పనితీరుపై నివేదికలు తెప్పించుకుని సమీక్షిస్తున్నట్లు వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ వెల్లడించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల్లో వారి పనితీరుతో పాటు గత రెండున్నరేళ్ల వ్యవహారశైలిని కూడా మదింపు చేస్తున్నట్లు సమాచారం. మంగళవారం పార్టీ నేతలు కొందరు జగన్‌తో ఆయన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఇటీవల జైల్లో ఉండి జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన పెళ్లకూరు జడ్పీటీసీ సభ్యుడు సత్యనారాయణ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఆయన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని పార్టీ నేతలంతా కష్టపడి పనిచేయాలని జగన్ సూచించినట్లు తెలిసింది.
స్థానిక ఎన్నికల్లో పలువురు నియోజకవర్గ ఇన్‌ఛార్జులు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుని పార్టీని ప్రక్షాళన చేయాలని సత్యనారాయణ రెడ్డి సూచించినట్లు సమాచారం. దీనిపై స్పందించిన జగన్.. ఇన్‌ఛార్జుల పనితీరుపై జాబితా సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే వారితో మాట్లాడతానని పేర్కొన్నట్లు తెలిసింది. ఎన్నికల్లో టీడీపీ నేతలతో సఖ్యతగా వ్యవహరించడం, పోటీకి దూరంగా ఉండటం, అభ్యర్థులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వకపోవడం, ప్రచారంలో సహకరించకపోవడం, ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడం, ఎన్నికల ఫలితాలు వంటి అంశాల ఆధారంగా నివేదికలను విశ్లేషిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!