

మహిళలకు రాజకీయాల్లో, ఇతర రంగాల్లో మరిన్ని అవకాశాలు కల్పించేందుకే తాను పార్టీ స్థాపించానని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు మహిళలు నాయకత్వ స్థానాల్లో ఎదిగేందుకు తాను అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలను సమాన హక్కులు కలిగిన మనుషులుగా గుర్తించినది భారత రాజ్యాంగమేనని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్ 26 మహిళలకు నిజమైన పండుగ రోజని అభివర్ణించారు. రాజ్యాంగం మహిళలకు అనేక హక్కులు కల్పించినప్పటికీ, వాటిని స్వేచ్ఛగా వినియోగించుకునే పరిస్థితులు లేకపోవడం బాధాకరమని అన్నారు.
మహిళలు తమ చరిత్రను తామే రాసుకోవాలని, లేకపోతే వారి కృషికి తగిన గుర్తింపు లభించదని కవిత పేర్కొన్నారు. మహిళలకు పింఛన్లు, బంగారం, సైకిళ్లు ఇస్తామని హామీలు ఇవ్వడం కంటే ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించాలని రాజకీయ పార్టీలకు సూచించారు. పదవులు, నిర్ణయాధికారాల్లో మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా తన పార్టీ మహిళా విభాగానికి ‘తెలంగాణ రుద్రమ సేన’గా పేరు పెడుతున్నట్లు కవిత ప్రకటించారు. అనంతరం మహిళా నాయకులతో కలిసి తెలంగాణ రుద్రమ సేన పోస్టర్లను ఆవిష్కరించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!