

నాగార్జునసాగర్ నుంచి 90 టీఎంసీల కృష్ణా జలాలను తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయత్నాలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణలో తాగునీటి అవసరాలకే నీటి కొరత ఏర్పడుతున్న పరిస్థితుల్లో ఏపీ నీటి తరలింపును ఎలా సమర్థిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ప్రయత్నాలను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకుందని నిలదీశారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB)ను ఆశ్రయించిందా? ఏపీ నీటి తరలింపుపై ఫిర్యాదు చేసిందా? తెలంగాణకు మిగిలిన 40 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు కేటాయించాలని లేఖ రాసిందా? అని ప్రశ్నించారు. హైదరాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల తాగునీటి అవసరాలకు కృష్ణా జలాల్లో ఎంత కేటాయించారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ విమర్శించారు. KRMBలో తెలంగాణ ప్రాతినిధ్యం, రాష్ట్ర హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సమాధానం చెప్పాలని కోరారు. ఏపీ నీటి తరలింపును నిలిపివేయాలని కోరుతూ BRS తరఫున KRMBకి లేఖ రాస్తామని, కేంద్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెస్తామని ప్రకటించారు. అవసరమైతే న్యాయపోరాటంతో పాటు నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించి ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!