

రాబోయే 23 మున్సిపాలిటీలు, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కోరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం కూటమి పార్టీల నేతలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూటమికి మద్దతుగా నిలవడం ప్రభుత్వంపై, పాలనపై వారికి ఉన్న నమ్మకాన్ని మరోసారి చాటిందని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో తమపై మరింత బాధ్యత పెరిగిందని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, యువత ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పార్టీలు సమష్టిగా పనిచేస్తున్నాయని తెలిపారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, అవినీతి, విధ్వంసకర పాలనతో ప్రజలు విసిగిపోయారని ఆయన విమర్శించారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి స్ఫూర్తిని కాపాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తున్నారని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు ఎక్కడ పోటీ చేసినా వారి విజయానికి జనసేన శ్రేణులు కృషి చేస్తున్నాయని వివరించారు. ఈ ఎన్నికల్లో యువ నాయకత్వానికి కూటమి పార్టీలు అధిక ప్రాధాన్యత ఇచ్చాయని, కొత్త ఆలోచనలతో ముందుకొస్తున్న యువతకు అవకాశాలు కల్పించాయని తెలిపారు. యువ అభ్యర్థులకు ప్రజలు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి పార్టీలకు రాబోయే 23 మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజల ఆశీర్వాదం కొనసాగాలని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, BJP రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!