

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రూ.88,392 కోట్ల పెట్టుబడులతో కూడిన 18 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపే అంశం అజెండాలో ఉండనుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 54,210 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. శ్రీసత్యసాయి జిల్లాలో రూ.19 వేల కోట్లతో కియా పరిశ్రమ విస్తరణ, అనకాపల్లి జిల్లా తూటిపాలలో రూ.47,009 కోట్లతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపై కూడా చర్చ జరగనుంది. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 3 లేదా 5 తేదీల్లో ఆయన పర్యటన ఖరారయ్యే అవకాశం ఉందని కథనం పేర్కొంది.
మరోవైపు అమరావతి రాజధాని ప్రాంతంలో రూ.1,921 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాజధాని పరిధిలోని 26 గ్రామాల్లో రూ.1,215.70 కోట్లతో రహదారులు, డ్రెయిన్ల నిర్మాణం, రూ.80 కోట్లతో పచ్చదనం అభివృద్ధి, రూ.626.14 కోట్లతో అమరావతి సంగమం ప్రాజెక్టు ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియం, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ భవనాల నిర్మాణంతో పాటు, ఏఐఐబీ నిధులతో రహదారుల అభివృద్ధి, ఎల్పీఎస్ జోన్-10లో మౌలిక వసతుల కల్పనపైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. క్యాపిటల్ రీజియన్‌లో బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటు, పంచాయతీ ఎన్నికల తదుపరి దశలు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, నియోజకవర్గాల పునర్విభజన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!