

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా అడ్డుకోవాలన్నదే వైఎస్సార్‌సీపీ కుట్ర అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళంలో మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లను 24 శాతం నుంచి 34 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసిన తర్వాతే సుప్రీంకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. బీసీలకు సామాజిక న్యాయం కల్పించాలనే ఉద్దేశంతోనే రిజర్వేషన్ల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక ఎన్నికలు నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ నిధులను తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారని, అయితే జగన్‌మోహన్‌రెడ్డి అందుకు అడ్డుపడుతున్నారని విమర్శించారు.
మరోవైపు, బలహీనవర్గాలపై వైఎస్సార్‌సీపీ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించిందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. 1985లో ఎన్టీఆర్ తొలిసారిగా బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించారని, ఆ తర్వాత చంద్రబాబు హయాంలో వాటిని 34 శాతానికి పెంచారని పేర్కొన్నారు. గతంలో వివిధ ప్రభుత్వాల హయాంలో 34 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు జరిగాయని, వైఎస్సార్‌సీపీ పాలనలో వాటిని 24 శాతానికి తగ్గించారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లను ఎందుకు తగ్గించారో వైఎస్సార్‌సీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యంపై రాష్ట్రంలో కొనసాగుతున్న న్యాయ, రాజకీయ వివాదం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!