

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థులు పలు ప్రాంతాల్లో విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో నిర్వహించిన పోలింగ్‌లో 74.67 శాతం ఓటింగ్ నమోదైంది. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా కొనసాగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. జిల్లాల వారీగా ఏలూరులో అత్యధికంగా 84.83 శాతం పోలింగ్ నమోదుకాగా, విజయనగరంలో 83.33 శాతం, చిత్తూరులో 83.29 శాతం ఓటింగ్ నమోదైంది. అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో టీడీపీ మద్దతుదారులు పలు స్థానాల్లో విజయం సాధించినట్లు అనధికారిక సమాచారం వెల్లడించింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం బియ్యపుతిప్పలో రీకౌంటింగ్ అనంతరం కూటమి మద్దతు అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు.
మరోవైపు, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల సందర్భంగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం నరసంపల్లెలో బ్యాలెట్ బాక్స్‌లో సిరా పోసిన ఘటనపై జిల్లా కలెక్టర్ రీపోలింగ్‌కు ఆదేశించారు. అన్నమయ్య జిల్లా శెట్టిపల్లిలో నిరసనకారులు పోలీసు వాహనంపైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. కర్నూలు జిల్లా మండగిరిలోనూ ఘర్షణ కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా ఘటనలపై పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!