

తెలంగాణ నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త ప్రకటించారు. రాబోయే ఏడాది కాలంలో మరో 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ‘ప్రజాపాలన ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 75 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, వచ్చే ఏడాదిలో మరో 25 వేల నియామకాలు చేపట్టి లక్ష ఉద్యోగాల హామీని పూర్తి చేస్తామని తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించి, నియామకాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇదే సభా వేదికపై రాష్ట్రంలోని మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికుల కోసం కొత్తగా 4.89 లక్షల పింఛన్ల పంపిణీకి కూడా శ్రీకారం చుట్టారు. సభకు ముందు అచ్చంపేటలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చౌరస్తా నుంచి ప్రజాప్రతినిధులు, స్థానికులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం నియోజకవర్గంలో సుమారు రూ.450 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పాలమూరులో పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసి, కృష్ణా జలాలను ఈ ప్రాంత భూములకు అందిస్తామని హామీ ఇచ్చారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!