

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఆరో వారం నామినేషన్ల ప్రక్రియ సోమవారం (అక్టోబర్ 12) ఉత్కంఠభరితంగా సాగింది. కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధాలు, వ్యక్తిగత విమర్శలు హౌస్‌లో వేడిని పెంచాయి. ఈసారి బిగ్‌బాస్ కొత్త నామినేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి రౌండ్ ప్రారంభంలో సైరన్ మోగగానే ఒక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఇద్దరు పాత కంటెస్టెంట్లను ఎంపిక చేస్తారు. వారు టాస్క్‌లో పోటీపడగా విజేతకు ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం లభిస్తుంది. అనంతరం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఇరువైపుల వాదనలు విని ఒకరి నామినేషన్‌ను ఆమోదిస్తారు.
మొదటి రౌండ్లో శివ ఎంపిక చేసిన త్రిగుణ్, రోహిత్‌ల మధ్య టాస్క్‌లో రోహిత్ విజయం సాధించాడు. వంశీ, ఝాన్సీలను నామినేట్ చేసిన రోహిత్.. వంశీ ప్రవర్తన, మర్యాదపై ప్రశ్నలు లేవనెత్తడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఝాన్సీ ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను ఉపయోగించిన తీరుపైనా రోహిత్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. చివరకు శివ వంశీ నామినేషన్‌ను ఆమోదించాడు. రెండో రౌండ్లో శ్వేతా నాయుడు ఎంపిక చేసిన ముకేశ్, అమన్లలో ముకేశ్ విజయం సాధించాడు. అమన్ అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నాడని ఆరోపిస్తూ అతడిని నామినేట్ చేయడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. త్రిగుణ్ జోక్యంతో వివాదం మరింత ముదిరింది. షాలిని ఆటలో మరింత చురుగ్గా పాల్గొనాలని సూచిస్తూ ముకేశ్ ఆమెను కూడా నామినేట్ చేశాడు. శ్వేతా నాయుడు అమన్ నామినేషన్‌ను ఆమోదించింది. మూడో రౌండ్లో నీతూ నటరాజ్ ఎంపిక చేసిన షాలిని, వర్షిణిలలో షాలిని విజయం సాధించి దేబ్జానీని నామినేట్ చేసింది. దేబ్జానీ ఆటతీరుపై, తనను బాధపెట్టిన వ్యాఖ్యలపై షాలిని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య చర్చ మొదలైంది. ఎపిసోడ్ ముగిసే సమయానికి వారి వాదన కొనసాగుతుండటంతో మిగిలిన నామినేషన్లు, తుది జాబితాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!