

శాండ్‌పేపర్ గేట్ వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించిన వేళ.. 2018లో జరిగిన మరో పరిణామం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే ఏడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే, ఆ సిరీస్‌కు ముందే పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ ఆసీస్ ఆటగాళ్లు బంతిని టాంపరింగ్ చేసేందుకు ప్రయత్నించారా? అనే అనుమానాలు తాజాగా తెరపైకి వచ్చాయి. ఈ వ్యవహారంలో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లైయన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. 2018లో యూఏఈ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బంతికి షైన్ తీసుకురావడానికి మింట్ క్యాండీలను ఉపయోగించాలని లైయన్ సూచించినట్లు ఆస్ట్రేలియా మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
మరింత ఉమ్ము ఉత్పత్తి అయ్యేలా మింట్ క్యాండీలు నమలాలని లైయన్ తన సహచరులకు చెప్పినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఉస్మాన్ ఖవాజా తన తాజా ఆత్మకథలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ఓ సీనియర్ ఆటగాడు ఎక్కువ ఉమ్ము ఉత్పత్తి చేసేందుకు మింట్ క్యాండీలు ఉపయోగించాలని సూచించాడని ఖవాజా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆ ఆటగాడు దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లోనూ జట్టులో ఉన్నాడని పరోక్షంగా ప్రస్తావించడంతో ఆ వ్యక్తి లైయనే అయి ఉండొచ్చనే ప్రచారం మొదలైంది. అయితే, ఈ ఆరోపణలపై ఇంకా పూర్తి స్పష్టత లేదు. పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో నిజంగానే బాల్ టాంపరింగ్ జరిగిందా? లేదా? అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!