

గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు దిద్దుబాటుకు గురవుతూ తగ్గుముఖం పడుతున్నాయి. అమెరికా ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ పెరగడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు ఈ విలువైన లోహాల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అయితే, బంగారంతో పోలిస్తే వెండి ధర పతనం మరింత తీవ్రంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు వెండి ధర 120 డాలర్లను దాటగా, దేశీయంగా కిలో వెండి ధర రూ.4 లక్షలకు పైగా చేరింది. గతంలో సాధారణంగా లక్ష రూపాయల లోపే ఉండే వెండి ధర ఒక్కసారిగా ఈ స్థాయికి చేరడం పెట్టుబడిదారులను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు అదే స్థాయిలో వెండి ధర క్షీణిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కొంతకాలంగా ఔన్సు వెండి ధర 50 డాలర్ల దిగువనే ట్రేడవుతోంది. బుధవారం మరింత తగ్గి 45.87 డాలర్లకు చేరింది. దీంతో దేశీయంగా కిలో వెండి ధర రూ.1.70 లక్షల దిగువకు పడిపోయింది.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధర 1980, 2011 సంవత్సరాల్లో నమోదైన గత గరిష్ఠ స్థాయుల కంటే దిగువన ట్రేడవుతోంది. 1980 జనవరి 18న ఔన్సు వెండి ధర 49.45 డాలర్ల వద్ద, 2011 ఏప్రిల్ 20న 48.44 డాలర్ల వద్ద గరిష్ఠాలను నమోదు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో 120 డాలర్ల స్థాయికి చేరిన వెండి, ప్రస్తుతం భారీగా విలువ కోల్పోయింది. అమెరికాలో ద్రవ్యోల్బణం అధికంగా ఉండటంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు బలపడుతున్నాయి. వడ్డీ రాబడి లేని వెండి వంటి లోహాలపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గడానికి ఇది ఒక కారణం. మరోవైపు, డాలర్ విలువ, అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ పెరగడంతో ఇన్వెస్టర్లు వెండి నుంచి పెట్టుబడులను ప్రభుత్వ బాండ్ల వైపు మళ్లిస్తున్నారు. ఇతర ఆర్థిక సాధనాల్లో ఒత్తిడి కారణంగా నగదు అవసరాల కోసం కొందరు బంగారం, వెండిని విక్రయిస్తున్నారు. అంతేకాకుండా, పారిశ్రామికంగా వెండి వినియోగం తగ్గవచ్చనే అంచనాలు కూడా ధరల పతనానికి కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!