

బ్యాంకింగ్ సమాఖ్యల ఐక్య వేదిక (యూఎఫ్‌బీయూ) సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడంతో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 26న నాలుగో శనివారం, 27న ఆదివారం కావడంతో సమ్మెతో కలిపి వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకు శాఖల్లో కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. సెప్టెంబర్ 30 అర్ధవార్షిక ముగింపు రోజు కావడంతో ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్) బ్యాంకుల యాజమాన్యాలతో సమీక్ష నిర్వహించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చించింది. ఏటీఎంలు, ఆటోమేటెడ్ డిపాజిట్ యంత్రాల్లో నగదు కొరత లేకుండా చూడాలని, గ్రామీణ ప్రాంతాల్లో బీసీ కేంద్రాలు, సీఎస్‌పీలలో తగినంత నగదు అందుబాటులో ఉంచాలని సూచించింది.
వారానికి ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్‌తో పాటు, స్కేల్-4, ఆపై స్థాయి అధికారులకు మాత్రమే ప్రత్యేక పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) ఇవ్వడంపై యూనియన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో యూపీఐ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు కొనసాగుతాయని ప్రభుత్వ రంగ బ్యాంకులు వెల్లడించాయి. సెప్టెంబర్ 30 అర్ధవార్షిక ముగింపు నేపథ్యంలో చెక్కుల జమ, క్లియరింగ్, డ్రాఫ్ట్‌లు, పెద్ద మొత్తంలో నగదు ఉపసంహరణ వంటి పనులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున అత్యవసర బ్యాంకింగ్ పనులను సెప్టెంబర్ 25లోగా పూర్తి చేసుకోవాలని ఖాతాదారులకు సూచించాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!