

వీడియోకాన్ ఇండస్ట్రీస్ మాజీ ప్రమోటర్, డైరెక్టర్ వేణుగోపాల్ ధూత్ దివాలా తీసినట్లు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ముంబయి బెంచ్ ప్రకటించింది. వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియ, రుణాల చెల్లింపు ప్రణాళిక విఫలమవడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దాఖలు చేసిన పిటిషన్‌పై దివాలా స్మృతి (ఐబీసీ) కింద ఈ నిర్ణయం తీసుకుంది. వీడియోకాన్ ఇండస్ట్రీస్, వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్ వంటి గ్రూప్ సంస్థల కోసం ధూత్ వ్యక్తిగత హామీలు ఇవ్వడంతో, ఆయా రుణాల చెల్లింపుల్లో వైఫల్యంపై బ్యాంకులు 2018 ఫిబ్రవరిలోనే క్లెయిమ్‌లు దాఖలు చేశాయి.
వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా సిలిగురిలోని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ద్వారా 36 నెలల్లో రూ.600 కోట్లు చెల్లిస్తానని ధూత్ ప్రతిపాదించారు. అయితే, ముందస్తు చెల్లింపు లేకపోవడం, భవిష్యత్తులో చెల్లింపులు జరుగుతాయన్న నమ్మకం లేకపోవడంతో రుణదాతలు ఆ ప్రణాళికను తిరస్కరించారు. దీంతో జులైలో గత పరిష్కార ప్రక్రియను ముగించి, పూర్తిస్థాయి దివాలా చర్యలకు ఎన్‌సీఎల్‌టీ అనుమతించింది. తాజా ఉత్తర్వుల్లో భాగంగా ఆశిష్ నారాయణను దివాలా ట్రస్టీగా నియమించి, రుణదాతల నుంచి క్లెయిమ్‌లు స్వీకరించాలని, 90 రోజుల్లో ప్రాథమిక నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తన ఆర్థిక వివరాలను సమర్పించేందుకు ధూత్‌కు ఏడు రోజుల గడువు ఇచ్చింది. ఈ ప్రక్రియలో భాగంగా ఎస్‌బీఐ మొత్తం రూ.12,668 కోట్ల రుణాన్ని రికవరీ చేయాలని కోరుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!