

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడుతున్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంపై నెలకొన్న ఆందోళనలు భారత మార్కెట్లకు అనుకూలంగా మారుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఏఐ పెట్టుబడులు తక్కువగా ఉన్నాయనే కారణంతో భారత మార్కెట్లకు దూరంగా ఉన్న మదుపర్లు.. ప్రస్తుతం ‘యాంటీ ఏఐ’ సెంటిమెంట్‌తో దేశీయ షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సెన్సెక్స్ దాదాపు 1,100 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 24,800 పాయింట్లకు చేరువైంది. సెన్సెక్స్ క్రితం ముగింపు 79,310.01 పాయింట్లతో పోలిస్తే ఉదయం 79,413.66 వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. అనంతరం ర్యాలీ కొనసాగించి మధ్యాహ్నం 2 గంటల సమయానికి 1,095 పాయింట్ల లాభంతో 80,405 వద్ద ట్రేడయింది. నిఫ్టీ 259 పాయింట్లు పెరిగి 24,795 వద్ద కొనసాగింది.
సెన్సెక్స్ 30 సూచీలో మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సన్ ఫార్మా షేర్లు భారీ లాభాలు నమోదు చేశాయి. మరోవైపు పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, బీఈఎల్, ఇండిగో, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగాయి. మార్కెట్ల ర్యాలీకి ప్రధానంగా మూడు అంశాలు దోహదం చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల విజయం నేపథ్యంలో ఏఐ రంగంపై నిబంధనలు కఠినతరం కావచ్చన్న ఆందోళనలు, విదేశీ సంస్థాగత మదుపర్ల భారీ పెట్టుబడులు, కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించడం ఇందుకు కారణాలుగా పేర్కొంటున్నారు. గురువారం ఒక్కరోజే విదేశీ మదుపర్లు రూ.14,975 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. గత ఆరేళ్లలో ఒకే రోజులో ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి. ఇటీవలి పతనంతో ఆకర్షణీయ ధరలకు చేరిన లార్జ్‌క్యాప్ షేర్ల కొనుగోళ్లు కూడా మార్కెట్లకు ఊతమిచ్చాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!