

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వినియోగదారుల కోసం మూడు కొత్త వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం ఫోన్ కాల్స్, ఎస్సెమ్మెస్‌ల కోసం మొబైల్ కనెక్షన్ వినియోగించే వారికి ఇవి ఉపయోగపడనున్నాయి. ఈ ప్లాన్లలో ఇంటర్నెట్ డేటా ప్రయోజనాలు ఉండవు. అయితే దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్‌తో పాటు ప్రతిరోజూ 100 ఉచిత ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) నిబంధనల మేరకు ఇప్పటికే ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కూడా వాయిస్ ఓన్లీ ప్లాన్లను ప్రవేశపెట్టాయి. ఈ నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్ సైతం డేటా అవసరం లేని వినియోగదారులకు తక్కువ ధరలో ప్రత్యామ్నాయ రీఛార్జ్‌లను అందిస్తోంది.
బీఎస్‌ఎన్‌ఎల్ ప్రవేశపెట్టిన మూడు ప్లాన్ల ధరలు రూ.172, రూ.184, రూ.190గా ఉన్నాయి. వీటిలో ప్రధానంగా వ్యాలిడిటీలో మాత్రమే వ్యత్యాసం ఉంది. రూ.172 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుండగా, రూ.184 ప్లాన్ 30 రోజుల పాటు పనిచేస్తుంది. ఇక రూ.190 ప్లాన్ క్యాలెండర్ నెల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంది. ఈ మూడు రీఛార్జ్‌లలోనూ అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితంగా లభిస్తాయి. ట్రాయ్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌కు 9 కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లతో డేటా వినియోగం తక్కువగా ఉండే కస్టమర్లను ఆకర్షించడంపై సంస్థ దృష్టి సారించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!