

దేశవ్యాప్తంగా పండగలు, పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్నప్పటికీ బంగారం, వెండి ధరల పతనం ఆగడం లేదు. ఈ లోహాలను భౌతిక రూపంలో కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గడం, అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు, ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడవచ్చన్న అంచనాలు వంటి అంశాలు ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి. సాధారణంగా పండగలు, పెళ్లిళ్ల సమయంలో బంగారం, వెండికి డిమాండ్ పెరుగుతుందని భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
గురువారం హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర భారీగా తగ్గింది. బుధవారం ముగింపు సమయానికి 10 గ్రాముల బంగారం ధర రూ.1.35 లక్షలుగా ఉండగా.. గురువారం ఒక దశలో రూ.1,33,805కు దిగొచ్చింది. దీంతో ఒక్కరోజులోనే రూ.1,700కు పైగా తగ్గింది. వెండి ధర కూడా ఇదే బాటలో పయనించింది. బుధవారం కిలో వెండి ధర రూ.1.68 లక్షల వద్ద ముగియగా.. గురువారం దాదాపు రూ.3,000 తగ్గి రూ.1.65 లక్షలకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 3,710 డాలర్లకు దిగొచ్చింది. వెండి ఔన్సు ధర 44.88 డాలర్ల వద్ద కొనసాగింది. దేశీయ కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర రూ.1,28,878గా ఉండగా.. సిల్వర్ ఫ్యూచర్స్ కిలో ధర రూ.1,59,819గా నమోదైంది. అంతర్జాతీయ పరిణామాలు, కొనుగోళ్ల ధోరణుల నేపథ్యంలో విలువైన లోహాల ధరల్లో ఈ తగ్గుదల కనిపిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!