

విమానయాన రంగంలో సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (ఎస్ఏఎఫ్) వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా భారత్ ఏటా 5–7 బిలియన్ డాలర్ల (సుమారు రూ.47,000–65,800 కోట్ల) విమాన ఇంధన వ్యయాన్ని ఆదా చేసుకోవచ్చని కేంద్ర పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎస్ఏఎఫ్ విధానాన్ని రూపొందించే ప్రక్రియలో తమ మంత్రిత్వ శాఖ ఉందని, మరో ఒకటి రెండు వారాల్లో ప్రజల అభిప్రాయాల కోసం ముసాయిదాను విడుదల చేస్తామని వెల్లడించారు. 2040 నాటికి దేశంలో 10 మిలియన్ టన్నుల ఎస్ఏఎఫ్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించే అవకాశం ఉందని, ఇందుకు 70–85 బిలియన్ డాలర్ల (సుమారు రూ.6.65–8.07 లక్షల కోట్ల) పెట్టుబడులు అవసరమవుతాయని మంగళవారం నిర్వహించిన ఎస్ఏఎఫ్ సమిట్‌లో పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌కు ఎస్ఏఎఫ్ సరఫరా చేసే అవకాశాలు కూడా భారత్‌కు ఉన్నాయని అన్నారు.
ప్రస్తుతం దేశంలో ఏటా 9 మిలియన్ మెట్రిక్ టన్నుల ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) వినియోగిస్తుండగా, 2030 నాటికి ఈ డిమాండ్ 14.2 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుతుందని అంచనా. 2027 నాటికి విమాన ఇంధనంలో 1 శాతం ఎస్ఏఎఫ్ కలపడం తప్పనిసరి చేయాలని, 2030 నాటికి ఈ వాటాను 5 శాతానికి, 2031 నుంచి 2040 మధ్య క్రమంగా 40 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. మరోవైపు, స్వచ్ఛంద కార్పొరేట్ ఎస్ఏఎఫ్ కార్యక్రమాన్ని అభివృద్ధి చేసేందుకు ఎయిరిండియా, ఎయిర్‌బస్ భాగస్వామ్యం కానున్నాయి. వ్యాపార ప్రయాణాల్లో ఉద్గారాల తగ్గింపునకు విశ్వసనీయ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఎయిరిండియా సీఈఓ, ఎండీ టెవోల్డె గెబ్రెమరియం తెలిపారు. అలాగే, పానిపట్ రిఫైనరీ నుంచి వాణిజ్యపరంగా ఎస్ఏఎఫ్ సరఫరా చేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొందినట్లు ఐఓసీ ఛైర్మన్ ఏఎస్ సహానే వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!