

సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భారతీయ వినియోగదారుల కొనుగోలు విధానాల్లోనూ గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏఐ ఆధారిత షాపింగ్ టూల్స్ వినియోగంలో మిలీనియల్స్ ముందంజలో నిలుస్తున్నారు. ప్రముఖ గ్లోబల్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ మెకిన్సే అండ్ కంపెనీ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 1981 నుంచి 1996 మధ్య జన్మించిన మిలీనియల్స్‌లో ఏఐ షాపింగ్ వినియోగం 84 శాతంగా నమోదైంది. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన జెన్‌జీ వినియోగదారుల్లో ఇది 74 శాతంగా ఉంది. దీంతో ఏఐ షాపింగ్ వినియోగంలో మిలీనియల్స్ జెన్‌జీ కంటే ముందున్నారు.
ఏఐ ఆధారిత షాపింగ్ వినియోగంలో చైనా మొదటి స్థానంలో ఉండగా, భారత్ ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచ సగటు 53 శాతంగా ఉండగా, భారత్‌లో ఏఐ షాపింగ్ వినియోగం 76 శాతానికి చేరడం విశేషం. భారతీయ వినియోగదారులు కేవలం వస్తువులను వెతకడానికి మాత్రమే కాకుండా, వివిధ ఉత్పత్తులను పోల్చడం, వాటి వివరాలను విశ్లేషించడం, సరైన కొనుగోలు నిర్ణయాలు తీసుకోవడం, చివరికి చెల్లింపులు పూర్తి చేయడం వంటి పనులకు కూడా ఏఐ టూల్స్‌ను ఉపయోగిస్తున్నారు. దీంతో ఆన్‌లైన్ షాపింగ్‌లో కృత్రిమ మేధస్సు పాత్ర మరింత పెరుగుతోంది.
మెకిన్సే ఏజెంట్ కామర్స్ కన్స్యూమర్ సర్వే ప్రకారం, తరాల వారీగా ఏఐ షాపింగ్ వినియోగం పరిశీలిస్తే మిలీనియల్స్ 84 శాతంతో మొదటి స్థానంలో ఉన్నారు. జెన్‌జీ, జెన్‌ఎక్స్ రెండూ 74 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉండగా, బేబీ బూమర్స్‌లో ఈ వినియోగం 56 శాతంగా నమోదైంది. ఈ గణాంకాలు భారత్ ఏజెంటిక్ కామర్స్ దిశగా వేగంగా అడుగులు వేస్తోందని సూచిస్తున్నాయి. వినియోగదారుల ఆదేశాలను పాటించడమే కాకుండా, స్వయంగా సమాచారాన్ని విశ్లేషించి, ఉత్పత్తులను పోల్చి, కొనుగోలు నిర్ణయాలకు సహకరించే ఏఐ ఏజెంట్ల ద్వారా జరిగే ఈ కొత్త తరహా వ్యాపార విధానం భవిష్యత్తులో మరింత విస్తరించే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!