

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందినప్పటికీ, దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. విదేశీ పెట్టుబడులు, బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు అండగా నిలిచాయి. దీంతో గత సెషన్‌లో నమోదైన నష్టాల నుంచి మార్కెట్లు కోలుకున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 65 పైసలు బలపడి ఎనిమిది నెలల గరిష్ఠ స్థాయి అయిన రూ.92.20 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.3.50 లక్షల కోట్లు పెరిగి రూ.512.48 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ 1,502.29 పాయింట్లు లాభపడి 83,938.28 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 469.60 పాయింట్లు పెరిగి 25,819.25 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 27 షేర్లు లాభాలు నమోదు చేశాయి. హెచ్‌యూఎల్, ట్రెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండిగో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు రాణించాయి. మరోవైపు టాటా స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, టైటన్ నష్టపోయాయి. రంగాలవారీగా ఎఫ్‌ఎంసీజీ, ఆర్థిక సేవలు, బ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణ, బీమా సూచీలు లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, ఐరోపా మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి. ముడిచమురు బ్యారెల్ ధర మూడు శాతం పెరిగి 94 డాలర్ల వద్ద ట్రేడయింది.
కార్పొరేట్ పరిణామాల్లో భాగంగా టాటా స్టీల్ కొనుగోలు ఒప్పందం నేపథ్యంలో ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ షేరు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. ఇంట్రాడేలో 20 శాతం పడిపోయి 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.1,334.55ను తాకిన ఈ షేరు, చివరకు 11.40 శాతం నష్టంతో రూ.1,478 వద్ద ముగిసింది. రెండు రోజుల్లో మొత్తం 30.35 శాతం క్షీణించింది. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియాలో రెండు శాతం వాటాను మాతృసంస్థ విక్రయించనుంది. మరోవైపు ఆస్తమా చికిత్సకు ఉపయోగించే ఫ్లూటికాసోన్ హెచ్‌ఎఫ్‌ఏ ఇన్‌హేలర్‌కు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి లభించినట్లు సిప్లా వెల్లడించింది. క్లయింట్ల వాటా కొనుగోళ్లకు నిధుల సమీకరణ నిబంధనల రూపకల్పన కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్, డాయిష్ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2026–27 ఆర్థిక సంవత్సరానికి వాటాదారులకు రూ.2,908.99 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను ఎన్‌టీపీసీ చెల్లించింది. ఇదిలా ఉండగా, భారత్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నాయన్న వార్తలను గూగుల్ క్లౌడ్ ఖండించింది. గత వారం కార్యకలాపాల మార్పుల్లో భాగంగా 30 మంది ఉద్యోగులను మాత్రమే తొలగించామని, భారీ లేఆఫ్‌లపై వచ్చిన కథనాలు అవాస్తవమని ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేసింది. ఒప్పంద నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో భారత వెండర్ బీసీడీ ఎంప్రెసా విఫలమైందని ఫాక్స్‌కాన్ ఆరోపించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!