

జియో ప్లాట్‌ఫామ్స్ ఆదాయాన్ని పెంచుకునేందుకు టెలికాం టారిఫ్‌ల పెంపు కంటే కొత్త సేవలను ప్రవేశపెట్టడంపై ఎక్కువగా దృష్టి సారిస్తోందని సంస్థ ఎండీ ఆకాశ్ అంబానీ తెలిపారు. ఐపీఓకు సంబంధించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మొబైల్, హోమ్ బ్రాడ్‌బ్యాండ్, ఎంటర్ప్రైజ్, అంతర్జాతీయ సేవలు ఆదాయ వృద్ధికి ప్రధాన చోదక శక్తులని చెప్పారు. 2026 నుంచి 2031 మధ్య దేశంలో 34 కోట్ల మంది 4జీ, 5జీ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు తీసుకునే అవకాశం ఉందని, ఈ మార్కెట్లో అధిక వాటా సాధించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఈ ఏడాది మార్చి నాటికి జియో ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్ల సంఖ్య 2.86 కోట్లకు చేరిందని, గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో కొత్తగా నమోదైన ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లలో తమ వాటా 67.5 శాతంగా ఉందని తెలిపారు.
భవిష్యత్తులో టెలికాం టారిఫ్‌లు పెరిగే అవకాశం ఉందని ఆకాశ్ అంబానీ సంకేతాలిచ్చారు. అయితే, ధరల పెంపు ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేయలేదు. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో టెలికాం, డేటా చార్జీలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. 2016లో జియో సేవలు ప్రారంభమైన తర్వాత టెలికాం చార్జీల భారం భారతీయుల సగటు తలసరి ఆదాయంలో ఒక శాతానికి తగ్గిందని గుర్తుచేశారు.
ఆరోతరం టెలికాం సాంకేతికత అయిన 6జీ అభివృద్ధిపైనా జియో దృష్టి సారించిందని ఆకాశ్ అంబానీ తెలిపారు. మరో పదేళ్లలో ఈ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. జియో 6జీ సేవల కోసం టెలికాం సంస్థలు మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉండదని, ప్రస్తుతం వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ను నవీకరిస్తే సరిపోతుందని వివరించారు. 2029 నాటికి ప్రపంచవ్యాప్తంగా 6జీ ప్రమాణాలు ఖరారయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ సాంకేతికత ద్వారా ఇప్పటికే 54 కోట్ల మంది వరకు ఉన్న జియో 4జీ, 5జీ వినియోగదారులకు మరిన్ని సేవలు అందించవచ్చని చెప్పారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!