

ప్రముఖ మీడియా సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL) వాటాదారుల కోసం రూ.600 కోట్ల వరకు విలువైన షేర్ బైబ్యాక్‌ను ప్రకటించింది. కంపెనీ సమర్పించిన ఆఫర్ లెటర్ ప్రకారం గరిష్ఠంగా 6,59,34,065 ఈక్విటీ షేర్లను ఒక్కో షేరుకు రూ.91 చొప్పున తిరిగి కొనుగోలు చేయనుంది. నవంబర్ 27, 2026న ఎన్‌ఎస్‌ఈలో రూ.67.08 వద్ద ముగిసిన షేరు ధరతో పోలిస్తే బైబ్యాక్ ధర సుమారు 35.6 శాతం అధికంగా ఉంది. ఈ ఆఫర్‌లో షేర్లను టెండర్ చేసేందుకు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 7, 2026 వరకు అవకాశం ఉంటుంది. నవంబర్ 25, 2026 నాటికి జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు కలిగి ఉన్న వాటాదారులు మాత్రమే ఈ బైబ్యాక్‌లో పాల్గొనడానికి అర్హులు. ఆ తేదీ తర్వాత షేర్లు కొనుగోలు చేసిన వారికి ఈ అవకాశం వర్తించదు.
రికార్డు తేదీ నాటికి ప్రతి 14 షేర్లకు ఒక షేరు చొప్పున ప్రాథమిక అర్హత నిష్పత్తిని నిర్ణయించారు. చిన్న వాటాదారుల కోసం బైబ్యాక్‌లో కనీసం 15 శాతం వాటాను కేటాయించారు. కంపెనీ ప్రమోటర్లు ఈ ఆఫర్‌లో తమ షేర్లను విక్రయించడం లేదని తెలిపింది. అదనపు అప్పులు చేయకుండా అంతర్గత నగదు నిల్వలు, ఫ్రీ రిజర్వ్‌ల నుంచి బైబ్యాక్‌కు నిధులు సమకూర్చనున్నట్లు వెల్లడించింది. వాటాదారులు టెండర్ చేసిన అన్ని షేర్లను కంపెనీ ఆమోదించకపోవచ్చు. ఆమోదించిన షేర్లకు మాత్రమే ఒక్కో షేరుకు రూ.91 చెల్లిస్తారు; మిగిలిన షేర్లు తిరిగి డీమ్యాట్ ఖాతాలో జమ అవుతాయి. ఈ ప్రక్రియ డిసెంబర్ 14, 2026 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. బైబ్యాక్ ద్వారా వచ్చే మొత్తంపై వర్తించే పన్ను నిబంధనలను, తమ కొనుగోలు ధరను కూడా ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకోవాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!