

అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ ఐబీఎం (IBM) తన కన్సల్టింగ్ విభాగంలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులకు వీసా, గ్రీన్‌కార్డ్ స్పాన్సర్‌షిప్‌ను నిలిపివేసినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ప్రభావిత ఉద్యోగులకు మూడు వారాల గడువు ఇచ్చి, ఇతర దేశాల్లోని ఐబీఎం కార్యాలయాలకు బదిలీ కావాలా లేదా ఉద్యోగానికి రాజీనామా చేయాలా అనేది నిర్ణయించుకోవాలని సంస్థ సూచించినట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 31లోగా అమెరికాను విడిచివెళ్లే ఉద్యోగులకు మూడు నెలల సెవెరెన్స్ ప్యాకేజీ అందించనున్నట్లు సమాచారం. అయితే, భారత్‌కు తిరిగి వస్తే వేతనాల్లో భారీగా కోత పడే అవకాశం ఉందని కొందరు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్‌కు బదిలీ అయితే తన వేతనం 80 శాతం తగ్గుతుందని ఓ ఉద్యోగి వెల్లడించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. మారుతున్న నైపుణ్యాల అవసరాలు, క్లయింట్ల డిమాండ్లకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐబీఎం తెలిపినట్లు సమాచారం. అయితే, ఈ నిర్ణయంతో ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారనే వివరాలను సంస్థ వెల్లడించలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!