

దేశంలోని డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు కీలకంగా మారిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఆర్థికంగా సుస్థిరంగా కొనసాగేందుకు ఉద్దేశించిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధానం అమలుపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఎంపిక చేసిన యూపీఐ వ్యాపార లావాదేవీలపై ఎండీఆర్ విధించేందుకు సెప్టెంబర్‌లో ప్రకటించిన విధానానికి సంబంధించి తుది అమలు తేదీని వెల్లడించాలని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)లను కోరినట్లు సమాచారం. పండుగల సీజన్ కారణంగా ఈ విధానం అమలు వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో కొత్త ఛార్జీలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే దానిపై చెల్లింపుల రంగంలో ఆసక్తి నెలకొంది. డిజిటల్ చెల్లింపులను స్వీకరించే వ్యాపారుల నుంచి చెల్లింపుల వ్యవస్థలోని భాగస్వాములు వసూలు చేసే లావాదేవీ రుసుమునే మర్చంట్ డిస్కౌంట్ రేట్ అంటారు. సెప్టెంబర్ 15, 2026న ప్రకటించిన విధానం ప్రకారం, రూ.2,000కు మించిన అర్హత కలిగిన పర్సన్ టు మర్చంట్ (P2M) లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు ఒక్కో లావాదేవీపై గరిష్ఠంగా రూ.300 పరిమితి ఉంటుంది.
అయితే ఈ ఛార్జీలు అన్ని యూపీఐ లావాదేవీలకు వర్తించవు. రూ.2,000 వరకు జరిగే చెల్లింపులపై ఎలాంటి ఎండీఆర్ ఉండదు. నెలకు రూ.లక్ష వరకు యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు స్వీకరించే చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులకు సంబంధించిన P2PM విభాగంలోనూ జీరో ఎండీఆర్ కొనసాగుతుంది. రైల్వేలు, టెలికాం, బీమా, ఇంధనం, వ్యవసాయ ఇన్‌పుట్స్ వంటి కీలక రంగాల్లో రూ.2,000కు మించిన అర్హత కలిగిన లావాదేవీలపై 0.4 శాతానికి బదులుగా స్థిరంగా రూ.5 ఛార్జీ విధిస్తారు. మ్యూచువల్ ఫండ్లు, సెక్యూరిటీలు, స్టాక్ బ్రోకర్లు, డీలర్లకు సంబంధించిన చెల్లింపులపై 0.02 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. అయితే ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.300 పరిమితి ఉంటుంది. ఈ విధానంలో సాధారణ వినియోగదారులపై అదనపు భారం పడకుండా కేంద్రం చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి జరిగే పర్సన్ టు పర్సన్ (P2P) యూపీఐ లావాదేవీలు ఎప్పటిలాగే ఉచితంగా కొనసాగుతాయి. వ్యాపారులకు చెల్లింపులు చేసే వినియోగదారుల నుంచి కూడా ఎండీఆర్ వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. బ్యాంకులు, వ్యాపారులు ఈ ఛార్జీలను వినియోగదారులకు బదిలీ చేయకూడదని, యూపీఐ యాప్‌లు ప్లాట్‌ఫామ్ ఫీజులు లేదా ఇతర అదనపు ఛార్జీలు విధించకూడదని సూచించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!