

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీ రేటు అయిన రెపోరేటును మరో 75 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాక్స్ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. 2027 క్యాలెండర్ సంవత్సరం రెండో త్రైమాసికం నాటికి ఈ పెంపు అమలయ్యే అవకాశముందని పేర్కొంది. పెరుగుతున్న ఆహార ధరలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగుతుండటంతో ఆర్‌బీఐ కఠిన ద్రవ్య విధానాన్ని అనుసరించవచ్చని అభిప్రాయపడింది. అక్టోబర్‌లో జరిగిన ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో ఆర్‌బీఐ రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల తర్వాత చేపట్టిన ఈ పెంపు అనంతరం, డిసెంబర్ సమావేశంలో మరో 25 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. 2027 తొలి అర్ధభాగంలో మరో 50 బేసిస్ పాయింట్ల పెంపు ఉండొచ్చని తెలిపింది. ఈ అంచనాలు నిజమైతే రెపోరేటు 6.25 శాతానికి చేరుకునే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు పెరిగితే గృహ, వ్యక్తిగత రుణాలపై ఈఎంఐల భారం పెరగవచ్చు. అదే సమయంలో బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంటుంది.
ప్రస్తుత ఏడాది చివరి త్రైమాసికంతో పాటు 2027 తొలి త్రైమాసికంలోనూ రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతానికి పైనే ఉండవచ్చని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. వచ్చే ఏడాదిలో సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 5.7 శాతంగా నమోదవచ్చని పేర్కొంది. అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశించుకున్న 6 శాతం లక్ష్యాన్ని మించిందని గోల్డ్‌మన్ శాక్స్ చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ శంతను సేన్‌గుప్తా వెల్లడించారు. రాబోయే రెండు త్రైమాసికాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అభిప్రాయపడ్డారు. కఠిన ద్రవ్య విధానం వల్ల కంపెనీల రుణ వ్యయాలు పెరగడంతో పాటు పన్ను తగ్గింపుల ప్రయోజనాలు తగ్గే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఈ పరిణామాలు పెట్టుబడులు, వినియోగ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని హెచ్చరించింది. అయినప్పటికీ, 2027లో భారత జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉండవచ్చని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!