

టాటా సన్స్ ఛైర్మన్ పదవికి సంబంధించిన వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా టాటా మాజీ ట్రస్టీ, సీనియర్ న్యాయవాది డారియస్ ఖంబటా నాలుగు పేజీల లేఖ విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ పునర్నియామకంపై ట్రస్టీ వేణు శ్రీనివాసన్ అనుసరించిన వైఖరిని ఆయన ప్రశ్నించారు. ఆగస్టు 12న మరోసారి ఛైర్మన్ పదవి చేపట్టేందుకు తాను ఆసక్తిగా లేనని చంద్రశేఖరన్ ప్రకటించారని, ఆగస్టు 13న జరిగిన సమావేశంలో వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్ సహా ట్రస్టీలందరూ ఆయన నిర్ణయాన్ని గౌరవించాలని ఏకగ్రీవంగా అంగీకరించారని ఖంబటా గుర్తుచేశారు. అనంతరం కొత్త ఛైర్మన్ ఎంపిక కోసం సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే సెప్టెంబర్ 3న జరిగిన నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ (NRC) సమావేశంలో చంద్రశేఖరన్‌నే కొనసాగించాలని ప్రతిపాదించడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు. ఆగస్టులో ట్రస్టీలు తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయాన్ని వేణు శ్రీనివాసన్ NRC దృష్టికి తీసుకెళ్లారా లేదా అని నిలదీశారు. ఈ పరిణామాల అనంతరం సెప్టెంబర్ 17న టాటా సన్స్ బోర్డు చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్ల పదవీకాలాన్ని పొడిగించింది.
ఇదిలా ఉండగా, నవంబర్ 11న వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్ చేసిన ఆరోపణలకు కూడా ఖంబటా తన లేఖలో సమాధానమిచ్చారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు. టాటా సన్స్ లిస్టింగ్ ప్రతిపాదనకు వేణు, విజయ్‌లు 2024 మార్చి, 2025 మే, జులై నెలల్లో వ్యతిరేకంగా ఓటు వేశారని గుర్తుచేశారు. అయితే 2026 ఏప్రిల్‌లో తమ వైఖరిని మార్చుకున్నారని పేర్కొంటూ, ఈ అంశంపై ట్రస్టీల సమావేశాల్లో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. లిస్టింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలపై సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. సెప్టెంబర్ 17న తీసుకున్న నిర్ణయాలపైనే తన అభ్యంతరాలు ఉన్నాయని, చంద్రశేఖరన్ సంస్థకు అందించిన సేవలను తాను ప్రశ్నించడం లేదని స్పష్టం చేశారు. నోయల్ టాటా ప్రభావంతో తాను వ్యవహరిస్తున్నానన్న ఆరోపణలను కూడా ఖండించారు. గతంలో ట్రస్టీల ఛైర్మన్‌తోనూ పలుమార్లు విభేదించినట్లు వెల్లడించారు. చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని సూచిస్తూ, తీసుకునే నిర్ణయాలు టాటా సన్స్, టాటా ట్రస్టులు, మొత్తం టాటా గ్రూప్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని ఖంబటా పేర్కొన్నారు. అయితే ఈ లేఖపై వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్ ఇప్పటివరకు స్పందించలేదు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!