

ఫ్లాట్ల నిర్మాణంలో జాప్యం, నిర్ణీత గడువులోగా కొనుగోలుదారులకు ఇళ్లు అప్పగించకపోవడం, అనుమతులు లేకుండా విక్రయాలు చేపట్టడం వంటి ఉల్లంఘనలపై తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కఠిన చర్యలు చేపట్టింది. వాసవి లేక్‌సిటీ ఈస్ట్ ప్రాజెక్టులో భూయజమాని వాటా కింద ఉన్న ఫ్లాట్‌ను కొనుగోలు చేసిన కొమ్ము శ్యాంప్రసాద్‌కు అనుకున్న సమయానికి ఫ్లాట్ అప్పగించకపోవడంతో వాసవి రియల్టర్స్ ఎల్ఎల్పీకి రెరా షాక్ ఇచ్చింది. రూ.49.50 లక్షలు చెల్లించిన కొనుగోలుదారుడికి 2025 ఫిబ్రవరి 7 నాటికి ఫ్లాట్ అప్పగించాల్సి ఉండగా నిర్మాణంలో జాప్యం జరిగింది. భూయజమాని వాటా ఫ్లాట్ కావడంతో తమకు బాధ్యత లేదన్న సంస్థ వాదనను రెరా తిరస్కరించింది. 2023 నుంచి ఫ్లాట్ అప్పగించే వరకు కొనుగోలుదారు చెల్లించిన మొత్తంపై 10.85 శాతం వార్షిక వడ్డీ చెల్లించాలని, 60 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. మరోవైపు, మంచిరేవులలో ‘సనాలీ ఎడ్జ్’ పేరుతో రిజిస్ట్రేషన్ లేకుండానే ఫ్లాట్లు విక్రయించిన సనాలీ ఐటీ పార్క్స్ సంస్థపై రెరా రూ.25 లక్షల జరిమానా విధించింది. సంస్థ మేనేజింగ్ పార్టనర్ నూర్ హక్ ఈ మొత్తాన్ని 30 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. రెరా నుంచి అనుమతి పొందే వరకు ప్రాజెక్టులో ఎలాంటి అమ్మకాలు చేపట్టకూడదని స్పష్టం చేసింది.
ఇక సంగారెడ్డి జిల్లా వెలిమలలోని ‘ఆరా’ ప్రాజెక్టులో నిర్మాణం పూర్తి చేయనందుకు భువన్‌తేజ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కొనుగోలుదారులకు చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని రెరా ఆదేశించింది. రూ.26 లక్షలు అడ్వాన్సుగా చెల్లించిన కవిత వీరభొట్ల, సూరజ్ భరద్వాజ్‌లకు 10.85 శాతం వార్షిక వడ్డీతో కలిపి 45 రోజుల్లో నగదు చెల్లించాలని పేర్కొంది. గతంలోనే డిఫాల్టర్‌గా ప్రకటించిన ఈ సంస్థ ప్రాజెక్టులో కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించింది. అలాగే, తెల్లాపూర్‌లోని ‘త్రిపుర నిర్వాణ’ ప్రాజెక్టులో నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంతో త్రిపుర కన్స్ట్రక్షన్ సంస్థకు కూడా రెరా ఆదేశాలు జారీ చేసింది. కొనుగోలుదారు చెల్లించిన రూ.41.85 లక్షలను 10.85 శాతం వార్షిక వడ్డీతో సహా 60 రోజుల్లో తిరిగి చెల్లించాలని పేర్కొంది. మరో కేసులో, ‘అర్నేటి-1’ ప్రాజెక్టులో నిర్మాణ జాప్యంతో ఒప్పందం రద్దు చేసుకున్న కొనుగోలుదారుడికి ఊరట లభించింది. రూ.17 లక్షలు అడ్వాన్సుగా చెల్లించిన కొండా పీవీటీ రెడ్డికి ఆ మొత్తాన్ని 10.85 శాతం వార్షిక వడ్డీతో కలిపి 60 రోజుల్లో తిరిగి ఇవ్వాలని శ్రీ ఆదిత్య స్క్వేర్ సంస్థను రెరా ఆదేశించింది. నిర్మాణంలో జాప్యం చేసిన సంస్థకు క్యాన్సిలేషన్ ఛార్జీలు విధించే హక్కు లేదని స్పష్టం చేసింది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!