

తమిళనాడులోని తేని జిల్లాలో ఉన్న సబ్‌జైల్ నుంచి సోమవారం అర్ధరాత్రి 17 మంది ఖైదీలు పరారయ్యారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు తేని నుంచి దిండిగల్ వరకు హైఅలర్ట్ ప్రకటించి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 16 ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పరారైన ఖైదీల్లో ఒకరిని పోలీసులు తిరిగి అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. జైలు వెనుక ఉన్న అటవీ ప్రాంతంలోకి ఖైదీలు వెళ్లి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. వారిని పట్టుకునేందుకు 17 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సౌత్‌జోన్ ఐజీ విజయేంద్ర బిడారీ వెల్లడించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఖైదీలు పరారయ్యేందుకు ముందుగా ఒకరు మూర్ఛ వచ్చినట్లు నటించి జైలు సిబ్బందిని సెల్‌లోకి రప్పించినట్లు తెలుస్తోంది. సిబ్బంది గదిలోకి ప్రవేశించగానే వారిపై దాడి చేసి ఖైదీలు అక్కడి నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడిన సిబ్బందిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. 1995లో వేలూరు కోటలోని ప్రత్యేక నిర్బంధ కేంద్రం నుంచి ఎల్టీటీఈ సభ్యులుగా అనుమానించిన 43 మంది 153 అడుగుల సొరంగ మార్గం ద్వారా పరారయ్యారు. ఆ ఘటన తర్వాత ఈ స్థాయిలో ఖైదీలు తప్పించుకోవడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. తాజా ఘటన రాష్ట్రంలోని జైళ్ల భద్రతపై ఆందోళనలను పెంచింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!