

ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు మరో టోర్నీకి సిద్ధమైంది. మంగళవారం ప్రారంభం కానున్న హైలో ఓపెన్‌లో ఆమె బరిలోకి దిగనుంది. ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ ఆన్ సె యాంగ్ చేతిలో ఓడిన సింధుకు, ఆ క్రీడాకారిణిపై ఇది వరుసగా 11వ పరాజయం. అయినప్పటికీ మంచి ఫామ్‌లో ఉన్న సింధు జర్మనీలో టైటిల్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో తుర్కియేకు చెందిన నెస్లిహా అరిన్‌తో తలపడనుంది. మరోవైపు దేవిక సిహాగ్ థాయ్‌లాండ్‌కు చెందిన చౌచువాంగ్‌తో, అస్మిత చాలిహా బల్గేరియాకు చెందిన నాల్బంటోవాతో, ఉన్నతి హుడా చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి తెరెజా స్వాబికోవాతో పోటీ పడనున్నారు.
2019లో హైలో ఓపెన్ విజేతగా నిలిచిన భారత షట్లర్ లక్ష్య సేన్ మరోసారి టైటిల్‌పై కన్నేశాడు. పారిస్ టోర్నీలో గాయం కారణంగా తొలి రౌండ్‌లోనే వాకోవర్ ఇచ్చిన అతడు, ఈసారి తిరిగి ఫామ్ అందుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఫిన్లాండ్‌కు చెందిన జొయాకిమ్ ఓల్డార్ఫ్‌తో లక్ష్య తలపడనున్నాడు. యువ షట్లర్ ఆయుష్ శెట్టి తైవాన్‌కు చెందిన లీ యాంగ్‌తో పోటీ పడతాడు. తరుణ్ మన్నెపల్లి ఫ్రాన్స్‌కు చెందిన తోమా జూనియర్ పొపొవ్‌తో, హెచ్.ఎస్. ప్రణయ్ అదే దేశానికి చెందిన అలెక్స్ లానియర్‌తో తలపడనున్నారు. కిరణ్ జార్జ్ మలేసియాకు చెందిన జున్ వెయ్‌ను ఎదుర్కోనున్నాడు. ఈ టోర్నీలో భారత షట్లర్లు రాణించి అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తాను చాటాలని చూస్తున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!