

హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల అక్రమ విక్రయాలపై తెలంగాణ ఈగిల్ ఫోర్స్ అధికారులు చర్యలు చేపట్టారు. ఫతేనగర్ పరిధిలోని ఎల్‌బీఎస్ నగర్‌లో ఓ ఇంట్లో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో హైదరాబాద్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ప్రత్యేక బృందం రాత్రి వేళ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ దాడిలో గంజాయి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 75 ఏళ్ల షేక్ జథేన్ బీని అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి 179.1 గ్రాముల గంజాయి ఉన్న 41 చిన్న ప్యాకెట్లు, రూ.43,340 నగదు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంటికి గంజాయి కొనుగోలు కోసం వచ్చిన సుమారు 70 మందిని కూడా అధికారులు గుర్తించారు.
వైద్య పరీక్షల్లో 70 మందిలో 66 మందికి గంజాయిలోని మత్తు పదార్థమైన టెట్రాహైడ్రోకాన్నబినాల్ (THC) పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు. వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు వెల్లడించారు. గుర్తించిన వారిలో 65 మందిని డీ-అడిక్షన్ లేదా పునరావాస కేంద్రాలకు తరలించినట్లు సమాచారం. ఈ కేసులో మరో ఐదుగురు అనుమానితులు పరారీలో ఉన్నారని, గంజాయి సరఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. అరెస్టయిన మహిళపై గతంలోనూ ఏడు ఎన్‌డీపీఎస్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మైనర్లకు గంజాయి సరఫరా చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఎన్‌డీపీఎస్ చట్టం, జువెనైల్ జస్టిస్ చట్టంలోని సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!