

చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. ధైర్యం, ధర్మం, సత్యం, ఐకమత్యం, ఆత్మవిశ్వాసం వంటి విలువలను ఈ పండుగ బోధిస్తుందని అన్నారు. అహంకారం, అసూయ, ద్వేషం, అన్యాయం వంటి చెడు లక్షణాలను విడనాడి, ప్రేమ, కరుణ, సోదరభావం, మానవత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
విజయదశమి ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని, ప్రతి కుటుంబానికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు, విజయాలు కలగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మహిషాసురుడిపై అమ్మవారు, రావణాసురుడిపై శ్రీరాముడు సాధించిన విజయాలను ఈ పర్వదినం గుర్తుచేస్తుందని తెలిపారు. తెలంగాణలో దసరా సందర్భంగా జమ్మిచెట్టుకు పూజలు చేసి, జమ్మి ఆకులను బంగారంగా భావించి పెద్దలకు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవడం ప్రత్యేక సంప్రదాయమని పేర్కొన్నారు. ఈ ఆచారం ప్రకృతిని ప్రేమించడం, పెద్దలను గౌరవించడం వంటి విలువలను చాటిచెబుతుందని అన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!