

నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష హాల్టికెట్లలో తప్పులు దొర్లాయి. ఇటీవలే పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారులు విడుదల చేశారు. అయితే, కొంతమంది విద్యార్థుల హాల్టికెట్లలో పరీక్ష మాధ్యమం తప్పుగా నమోదైంది. దరఖాస్తు చేసుకునే సమయంలో తెలుగు మాధ్యమాన్ని ఎంపిక చేసుకున్న విద్యార్థులకు ఇంగ్లిష్ మాధ్యమం అని హాల్టికెట్లలో పేర్కొన్నారు. అలాగే ఇంగ్లిష్ మాధ్యమాన్ని ఎంపిక చేసుకున్న కొందరికి తెలుగు మాధ్యమం అని వచ్చింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
హాల్టికెట్లలో నమోదైన తప్పుల కారణంగా పరీక్ష సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయేమోనని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ నవోదయ ప్రాంతీయ కేంద్రం కమిషనర్‌కు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించినప్పటికీ, ఇప్పటివరకు స్పందన రాలేదని విద్యార్థులు చెబుతున్నారు. పరీక్షకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించి హాల్టికెట్లలోని తప్పులను సరిచేయాలని విద్యార్థులు కోరుతున్నారు. తాము దరఖాస్తు సమయంలో ఎంపిక చేసుకున్న మాధ్యమంలోనే పరీక్ష రాసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!