

ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న తీవ్ర అత్యవసర పరిస్థితి సమయంలో విమానాన్ని అదుపులోకి తీసుకున్న ఇద్దరు ‘రహస్య పైలట్లు’ ప్రయాణికుల మధ్యే ఉన్నట్లు తెలుస్తోంది. వారిద్దరూ డెడ్‌హెడింగ్ అనే విధానంలో ప్రయాణిస్తున్న పైలట్లు అని ప్రయాణికుడు డేనియల్ స్లిచెర్ వెల్లడించారు. టెల్ అవీవ్ నుంచి దుబాయ్ తిరుగు ప్రయాణంలో ఆ విమానాన్ని నడపాల్సి ఉండటంతో వారు అదే విమానంలో ప్రయాణిస్తున్నారని తెలిపారు. కాక్‌పిట్‌లో పరిస్థితి అదుపుతప్పిన తర్వాత ప్రయాణికులు లోపలికి చేరుకుని కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్న సమయంలో ఈ ఇద్దరు పైలట్లు రంగంలోకి దిగారు.
ముందు వరుసలో కూర్చున్న స్లిచెర్ తెలిపిన వివరాల ప్రకారం.. అదనపు పైలట్లలో ఒకరు వెంటనే కాక్‌పిట్‌లోకి వెళ్లి విమాన నియంత్రణను చేపట్టారు. అనంతరం మరో పైలట్ కూడా లోపలికి వెళ్లి కాక్‌పిట్ తలుపులు మూసేశారు. విమానం తీవ్రంగా దిగజారిన తర్వాత దాన్ని స్థిరీకరించేందుకు వారు చర్యలు చేపట్టారు. సుమారు 45 నిమిషాల తర్వాత సౌదీ అరేబియాలోని తబుక్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయనున్నట్లు ప్రయాణికులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనలో సహాయం చేసిన ఇద్దరు పైలట్లను ఫ్లైదుబాయ్ ఇప్పటివరకు అధికారికంగా పేర్లతో వెల్లడించలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!