

అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రహదారులు, రవాణా వ్యవస్థకు గణనీయమైన నష్టం వాటిల్లింది. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 126 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రహదారులు దెబ్బతిన్నాయి. బలమైన గాలులకు 1,058 చెట్లు నేలకూలగా, వాటిలో 859 చెట్లను తొలగించారు. రెండు చోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. నీరు నిలిచిపోవడం, ఇతర సమస్యల కారణంగా 57 ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, 20 చోట్ల సమస్యలను పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. తాత్కాలిక మరమ్మతులకు రూ.9.17 కోట్లు, శాశ్వత పునరుద్ధరణ పనులకు రూ.50.27 కోట్లు అవసరమవుతాయని ఇంజినీర్లు అంచనా వేశారు. మొత్తంగా రూ.59.44 కోట్ల వ్యయం అవుతుందని పేర్కొన్నారు. వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
జాతీయ రహదారులపైనా తుఫాన్ ప్రభావం కనిపించింది. వివిధ మార్గాల్లో 149 చెట్లు నేలకూలగా, రావులపాలెం సమీపంలోని సిద్ధాంతం నుంచి అనకాపల్లి వరకు 75 చెట్లు, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో మరో 74 చెట్లు పడిపోయాయి. అధికారులు చెట్లను తొలగించి, కూలిన విద్యుత్ స్తంభాన్ని సైతం తొలగించారు. జాతీయ రహదారులపై సుమారు 1,350 గుంతలను గుర్తించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఏలూరు నుంచి శ్రీకాకుళం వరకు జాతీయ రహదారులపై సహాయక చర్యల కోసం 32 రూట్ పెట్రోలింగ్ వాహనాలు, 31 అంబులెన్స్‌లు, 35 క్రేన్లు, 47 జేసీబీలు, 25 చెట్లు నరికే రంపాలు, 45 డంపర్లను అందుబాటులో ఉంచారు. అదనంగా 24 ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. నీరు నిలిచిన సర్వీస్ రోడ్లు, అండర్‌పాస్‌ల వద్ద పంపులతో నీటిని తొలగిస్తున్నారు. తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తగా బస్సు సర్వీసులను నిలిపివేయగా, మరికొన్ని ప్రాంతాల్లో పరిమితంగా నడిపారు. రహదారుల మరమ్మతులు, చెట్ల తొలగింపు, నీటి తొలగింపు పనులను వేగవంతం చేసి రవాణా వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకురావడంపై అధికారులు దృష్టి సారించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!