

‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ – యువ సంగమం ఫేజ్-7’ కార్యక్రమంలో భాగంగా అస్సాంలోని ఐఐటీ గువాహటి నుంచి తెలంగాణకు వచ్చిన 72 మంది విద్యార్థుల బృందంతో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గురువారం హైదరాబాద్‌లోని లోక్‌భవన్ దర్బార్ హాల్‌లో ముఖాముఖి నిర్వహించారు. విద్యా పర్యటనలు కేవలం షాపింగ్, వినోదానికే పరిమితం కాకూడదని, ఆయా ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, సాంకేతిక విశిష్టతలను తెలుసుకోవడమే వాటి అసలు ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. పర్యటించిన ప్రాంతాల ప్రత్యేకతలను లోతుగా అధ్యయనం చేసి, తమ అనుభవాలను ఇతరులతో పంచుకోవాలని విద్యార్థులకు సూచించారు.
తెలంగాణ వారసత్వం గురించి ప్రస్తావిస్తూ చార్మినార్ చరిత్ర, గోల్కొండ కోట నిర్మాణంలోని సాంకేతికత, స్థానిక భాష, ఆహారపు అలవాట్లు, పండుగల ప్రత్యేకతలను తెలుసుకోవాలని గవర్నర్ సూచించారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అక్టోబర్ 23 నుంచి 29 వరకు నిర్వహిస్తున్న యువ సంగమం కార్యక్రమం జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు, దేశంలోని విభిన్న సంస్కృతులను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. అస్సాం, తెలంగాణ మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని బలోపేతం చేయాలని, ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని తెలంగాణకు, తెలంగాణ ప్రత్యేకతలను ఈశాన్య ప్రాంతాలకు పరిచయం చేసే వారధులుగా విద్యార్థులు నిలవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆతిథ్యం, హైదరాబాద్ సాంకేతిక అభివృద్ధి తమను ఆకట్టుకున్నాయని విద్యార్థులు తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, సంయుక్త కార్యదర్శి కొమండూరు శశి కిరణ్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం నోడల్ అధికారి డా. ఎస్. అరుళ్మొజి, ఇతర అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!