

సైబర్ మోసాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేశారు. అనుమానాస్పద బ్యాంకు లావాదేవీల సందేశాలకు స్పందించడం వల్ల ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వాట్సాప్ సందేశాలు, ‘ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్’ వంటి పద్ధతులను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు మొబైల్ ఫోన్లను తమ నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. బ్యాంకు ఖాతా నుంచి నగదు డెబిట్ అయినట్లు నకిలీ సందేశాలు పంపించి, ఆ లావాదేవీ తాము చేయలేదని భావిస్తే ‘యెస్’ లేదా ‘నో’ అని రిప్లై ఇవ్వాలని కేటుగాళ్లు కోరుతున్నట్లు తెలిపారు. ఇలాంటి సందేశాలకు స్పందించడం వల్ల మాల్‌వేర్ ముప్పు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇటీవల ఒక చార్టర్డ్ అకౌంటెంట్ బ్యాంకు ఖాతా నుంచి రూ.లక్ష మాయమైన ఘటనను ప్రస్తావిస్తూ సజ్జనార్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే బ్యాంకు లావాదేవీల సందేశాలకు ఎలాంటి సమాధానం ఇవ్వవద్దని స్పష్టం చేశారు. ఖాతాలో నగదు తగ్గినట్లు సందేశం వస్తే, బ్యాంకు అధికారిక యాప్‌లో స్టేట్‌మెంట్‌ను తనిఖీ చేయాలని సూచించారు. సందేహాలు ఉంటే బ్యాంకు అధికారిక కస్టమర్ కేర్‌ను మాత్రమే సంప్రదించాలని కోరారు. సైబర్ మోసంలో డబ్బు పోగొట్టుకున్నవారు వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!