

హైదరాబాద్‌కు చెందిన ఓ ఉద్యోగి దాదాపు పదేళ్లపాటు పనిచేసిన డెలాయిట్ సంస్థకు రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాలేజీ చదువు పూర్తయిన వెంటనే సంస్థలో చేరిన ఆయన.. కష్టపడి పనిచేస్తే మంచి కెరీర్ వృద్ధితో పాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయని ఆశించారు. అయితే కాలక్రమేణా వారానికి 70 గంటలకు పైగా పని చేయడం, అర్ధరాత్రి వరకు క్లయింట్ల కాల్స్‌లో పాల్గొనడం, వారాంతాల్లోనూ విధులు నిర్వర్తించడం, పెరుగుతున్న బాధ్యతలు ఆయనపై ఒత్తిడిని పెంచాయి. ఈ పరిస్థితులు వ్యక్తిగత జీవితం, ఆరోగ్యంపై ప్రభావం చూపినట్లు ఆయన వెల్లడించారు.
ఏడాదికి సుమారు రూ.35 లక్షల వేతనం అందుకుంటున్నప్పటికీ, కేవలం 5 శాతం జీతం పెంపు మాత్రమే లభించడం, అదనపు బాధ్యతలు చేపట్టినా పదోన్నతి రాకపోవడం రాజీనామా నిర్ణయానికి ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. సంస్థలో పనిచేసిన కాలంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, మంచి అనుభవం లభించిందని చెబుతూనే మెరుగైన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కల్పించే కొత్త ఉద్యోగాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. అధిక వేతనం కంటే ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం, దీర్ఘకాలిక కెరీర్ స్థిరత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలనే తన నిర్ణయం కార్పొరేట్ ఉద్యోగుల పని ఒత్తిడి, ఉద్యోగుల పట్ల సంస్థల బాధ్యతలపై మరోసారి చర్చకు దారితీసింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!