

ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో చర్చలు జరపాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. గతేడాది నుంచి కిమ్‌తో మాట్లాడేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఇప్పటికే అందుబాటులో ఉన్న కమ్యూనికేషన్ మార్గాలు, ఫోన్ లైన్ల ద్వారా ఎలాంటి స్పందన రాలేదని సమాచారం. దీంతో తాజాగా కిమ్‌కు ఓ లేఖ రాసిన ట్రంప్.. దానిని ఆయనకు చేరవేయాలని అమెరికా అధికారులకు అప్పగించారు. ఇందుకోసం అధికారులు ఓ అసాధారణ మార్గాన్ని ఎంచుకున్నారు. న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లో ఉన్న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఉత్తరకొరియా శాశ్వత ప్రతినిధి కార్యాలయం ద్వారా ఆ లేఖను అందించాలని భావించారు.
వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. అమెరికా అధికారులు ఉత్తరకొరియా కార్యాలయం వెలుపల కొంతసేపు వేచి ఉన్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ ఉత్తరకొరియా దౌత్యవేత్తకు లేఖను అందజేశారు. తొలుత దానిని తీసుకున్న ఆ దౌత్యవేత్త.. ఐరాస సమావేశానికి హాజరై తిరిగి వస్తూ అమెరికా ప్రతినిధుల ఎదుట ఉన్న బల్లపై లేఖను ఉంచి వెళ్లిపోయారు. కనీసం దానిని తెరిచి కూడా చూడలేదని కథనం పేర్కొంది. ట్రంప్ తన ఆసియా పర్యటన సమయంలోనూ కిమ్‌తో భేటీకి ప్రయత్నించినప్పటికీ.. ఉత్తరకొరియా విధించిన షరతులు ఆమోదయోగ్యంగా లేకపోవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. మరోవైపు 2019లో ట్రంప్-కిమ్ చర్చలు విఫలమైన తర్వాత ఉత్తరకొరియా అణ్వాయుధ కార్యక్రమాన్ని వేగవంతం చేసిందని సమాచారం. 2019లో 20 నుంచి 30 వరకు ఉన్న అణు వార్‌హెడ్‌ల సంఖ్య ప్రస్తుతం సుమారు 60కు చేరినట్లు అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా, గతంలో ఉపయోగించిన లిక్విడ్ ఫ్యూయల్ రాకెట్లకు బదులుగా గుర్తించడం కష్టమైన సాలిడ్ ఫ్యూయల్ క్షిపణులను కూడా అభివృద్ధి చేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!