

హైదరాబాద్–విజయవాడతో పాటు మచిలీపట్నం వైపు రాకపోకలకు కీలకమైన జాతీయ రహదారి-65 (NH-65) విస్తరణ పనులను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్, సభ్యుడు (ప్రాజెక్టులు) విప్నేష్ శర్మతో ఆయన సమావేశమై ఈ ప్రాజెక్టుపై చర్చించారు. రహదారిపై పెరుగుతున్న వాహనాల రద్దీ, తరచూ జరుగుతున్న ప్రమాదాలపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసి, నిర్మాణ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని కోరారు.
ప్రతిపాదిత ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్ల రహదారిని ఆరు లేన్లుగా విస్తరించడంతో పాటు, ఇరువైపులా సర్వీస్ రోడ్లు, నియంత్రిత ప్రవేశ సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నారు. 2026 నవంబర్ 11 వరకు టెండర్ల దాఖలుకు గడువు ఉందని, 2027 జనవరి నాటికి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని NHAI ఛైర్మన్ తెలిపినట్లు వెల్లడైంది. ఈ విస్తరణ పూర్తయితే ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ప్రయాణ సమయం ఆదా అవుతుందని, రహదారి భద్రత మెరుగుపడుతుందని భావిస్తున్నారు. ప్రాజెక్టు సకాలంలో ముందుకు సాగేలా కేంద్ర సంస్థలతో సమన్వయం చేసుకుంటామని మంత్రి తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!