

దివంగత రతన్ టాటా తమ్ముడు, సర్ రతన్ టాటా ట్రస్ట్ శాశ్వత ట్రస్టీ అయిన జిమ్మీ ఎన్. టాటా.. టాటా గ్రూప్‌లో కొనసాగుతున్న విభేదాలపై తొలిసారి బహిరంగంగా స్పందించారు. మాజీ ట్రస్టీ విజయ్ సింగ్‌తో జరిగిన సంభాషణకు సంబంధించిన నోట్‌లో టాటా ట్రస్టుల్లో నోయెల్ టాటా కుటుంబ సభ్యుల ప్రభావం పెరుగుతోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ట్రస్టులు ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సంస్థలని, వాటిని ప్రైవేటు కుటుంబ ఆస్తులుగా చూడకూడదని పేర్కొన్నారు. 2013–14లో టాటా సన్స్ నిబంధనల్లో చేసిన మార్పులపైనా ప్రశ్నలు లేవనెత్తారు. ఆ మార్పుల వల్ల టాటా ట్రస్టుల ఛైర్మన్‌కు విస్తృతమైన వీటో అధికారాలు లభించాయని, కంపెనీ బోర్డు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం తగ్గిందని ఆయన అభిప్రాయపడ్డారు.
టాటా సన్స్‌ను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయాలని జిమ్మీ టాటా మద్దతు తెలిపారు. దీనివల్ల సంస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని పేర్కొన్నారు. టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ కొనసాగింపునకు కూడా ఆయన మద్దతు ప్రకటించారు. ట్రస్టీల పదవీకాల నిబంధనల్లో అసమానతలు ఉన్నాయని, నాయకత్వంతో విభేదించే వారిని పక్కన పెడుతున్నారనే ఆందోళనలను కూడా తన నోట్‌లో ప్రస్తావించారు. టాటా సన్స్ లిస్టింగ్‌కు సంబంధించిన నిబంధనలను అమలు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కోరారు. ట్రస్టులు స్థాపించిన అసలు ప్రజాసేవ లక్ష్యాలను కాపాడాలని సూచించారు. జిమ్మీ టాటా వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ఆరోపణలతో టాటా ట్రస్టుల నిర్వహణ, టాటా సన్స్ భవిష్యత్తు, నాయకత్వంపై కొనసాగుతున్న విభేదాలు మరోసారి చర్చలోకి వచ్చాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!