

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ దర్శనానికి వచ్చే ట్రాన్స్జెండర్లు చెల్లుబాటు అయ్యే వైద్య పత్రాలు, అధికారిక లింగ గుర్తింపు ధృవీకరణ పత్రాలు సమర్పించాలని కేరళ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. తమిళనాడుకు చెందిన ట్రాన్స్జెండర్ సత్యశ్రీ షర్మిల రెహమత్ అలీ దాఖలు చేసిన పిటిషన్పై ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చింది. అయ్యప్ప భక్తులు పాటించే సంప్రదాయ నియమాలను అనుసరిస్తూ తనకు ఆలయ ప్రవేశం కల్పించాలని ఆమె కోర్టును కోరారు. ఈ అంశంలో ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డు (టీడీబీ) తీసుకున్న వైఖరికే కట్టుబడి ఉంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
భక్తుల లింగాన్ని స్వయంగా నిర్ధారించే సాంకేతిక సదుపాయాలు లేదా చట్టబద్ధమైన అధికారం టీడీబీకి లేదని ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. అవసరమైన పత్రాలు లేకుండా ప్రవేశం కల్పిస్తే సంప్రదాయ ఆచారాలకు విఘాతం కలిగే అవకాశం ఉందని బోర్డు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపింది. గతంలో శబరిమలను దర్శించుకున్నానని చెప్పిన సత్యశ్రీని, ఈ ఏడాది ఆగస్టు 20న పంపా గణపతి ఆలయం వద్ద సాధారణ తనిఖీల సమయంలో పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం. లింగ గుర్తింపునకు సంబంధించిన పత్రాలను తమిళనాడులోని వైద్య అధికారుల నుంచి పొందాలని సూచించినట్లు ఆమె తెలిపారు. మరోవైపు, శబరిమల ఆచారాలు, నిబంధనలు, మతపరమైన హక్కులకు సంబంధించిన వివాదాలు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నాయని కేరళ ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. అత్యున్నత న్యాయస్థానం తుది నిర్ణయం వెలువరించే వరకు పిటిషన్ను కొట్టివేయాలని కోరింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!