

మసీదులో నమాజ్ చేసుకునే హక్కుపై మద్రాస్ హైకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. ఒక వ్యక్తి ఏ రాజకీయ పార్టీకి చెందినవారైనా మసీదులో ప్రార్థనలు చేసుకునే హక్కు ఉంటుందని జస్టిస్ వి. లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బీజేపీ లేదా ఇతర రాజకీయ పార్టీలతో అనుబంధం ఉందనే కారణంతో ఎవరినైనా నమాజ్ చేయకుండా అడ్డుకోవడం చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. ప్రార్థనా స్థలాల్లో రాజకీయ విభేదాలకు తావుండకూడదని, మతపరమైన హక్కులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించింది. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ ప్రార్థనలు చేసుకునే అవకాశం ఉండాలని న్యాయస్థానం అభిప్రాయపడింది.
మసీదుల యాజమాన్య హక్కులు అల్లాహ్‌కే చెందుతాయని, మనుషులు కేవలం వాటి నిర్వహణ బాధ్యతలను మాత్రమే చూసుకుంటారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఎవరు నిజమైన ముస్లిం అనే విషయాన్ని నిర్ణయించేది దేవుడే తప్ప సాధారణ వ్యక్తులు కాదని స్పష్టం చేశారు. సేలంకు చెందిన బీజేపీ మైనారిటీ మోర్చా సభ్యుడు సయ్యద్ ఇబ్రహీం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రార్థనలు చేయకుండా ఎవరినైనా అడ్డుకోవడం తప్పని పేర్కొంటూ, మత స్వేచ్ఛ, సమానత్వం, ప్రాథమిక హక్కుల ప్రాధాన్యతను న్యాయస్థానం గుర్తుచేసింది. సామాజిక హోదా, రాజకీయ అభిప్రాయాలతో సంబంధం లేకుండా ప్రార్థనా స్థలాల్లో అందరికీ సమాన గౌరవం కల్పించాలని స్పష్టం చేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!