

ఆంధ్రప్రదేశ్లో సెమీకండక్టర్ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఇండియా సెమీకండక్టర్ మిషన్ రెండో దశ (సెమికాన్ 2.0)కు అనుగుణంగా సెమీకండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ 4.0ను సవరించింది. ఈ సవరణ ప్రకారం సిలికాన్ ఫ్యాబ్స్, డిస్ప్లే ఫ్యాబ్స్, చిప్ ప్యాకేజింగ్ పరిశ్రమలకు కేంద్రం అందించే మూలధన ప్రోత్సాహకాలకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనపు సహాయం అందించనుంది. సిలికాన్ ఫ్యాబ్లకు అర్హత కలిగిన పెట్టుబడి వ్యయంలో కేంద్రం 40 శాతం, రాష్ట్రం 40 శాతం కలిపి మొత్తం 80 శాతం వరకు ఆర్థిక సహాయం లభించనుంది. కాంపౌండ్ సెమీకండక్టర్లు, ఫోటోనిక్స్, సెన్సార్లు, డిస్ప్లే ఫ్యాబ్స్, అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్ యూనిట్లకు 70 శాతం, లెగసీ ప్యాకేజింగ్ యూనిట్లకు 50 శాతం వరకు మద్దతు లభిస్తుంది. ఈ సవరణకు సంబంధించి నవంబర్ 16న జీవో నంబర్ 87 జారీ చేశారు. చిప్ డిజైన్ స్టార్టప్లకు రూ.22.5 కోట్ల వరకు సీడ్ ఫండింగ్, యంత్రాలు, మెటీరియల్స్ విభాగానికి 48 శాతం వరకు క్యాపిటల్ సపోర్ట్, పరిశోధన, అభివృద్ధి, నైపుణ్య శిక్షణ ప్రాజెక్టులకు కేంద్రం, రాష్ట్రం కలిపి 75 శాతం వరకు సహాయం అందించనున్నారు.
రాష్ట్రంలో సెమీకండక్టర్ పరిశ్రమల అభివృద్ధి కోసం తిరుపతిలో సుమారు 5,000 ఎకరాల్లో ప్రత్యేక సెమీకండక్టర్ పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందులో పరిశ్రమలకు అవసరమైన క్లీన్రూమ్స్, విద్యుత్, అల్ట్రాప్యూర్ వాటర్, గ్యాస్ సదుపాయాలు, పరీక్షా కేంద్రాలు, పరిశోధన, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పెట్టుబడిదారులకు అనుమతులు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ఏపీ సెమీకండక్టర్ గ్రోత్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నారు. ఐఐటీ తిరుపతిలో ప్రారంభమై అనంతరం పార్కుకు తరలించేలా పరిశోధన, ఆవిష్కరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు శిక్షణ కేంద్రంలో ఒక్కో అభ్యర్థికి నెలకు రూ.10 వేల చొప్పున ఆరు నెలల పాటు శిక్షణ సబ్సిడీ ఇవ్వనున్నారు. రూ.1,000 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల పెట్టుబడులున్న మెగా ప్రాజెక్టులు, రూ.5,000 కోట్లకు పైగా పెట్టుబడులున్న అల్ట్రా మెగా ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీలు అందించనున్నారు. ఈ విధానంతో రాష్ట్రాన్ని చిప్ తయారీ, ప్యాకేజింగ్, పరిశోధన రంగాల్లో కీలక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!