

అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఐకానిక్ టవర్ల పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం CRDA, ADCL ఇంజినీర్లు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత నెలలో వర్షాల కారణంగా నిర్మాణ పనులకు అంతరాయం కలిగిందని, ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. ఐకానిక్ టవర్లలో తొలి డయాగ్రిడ్ నిర్మాణం పూర్తయిందని, ప్రతి రెండు నెలలకు ఆరు అంతస్తుల చొప్పున నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ఐకానిక్ అసెంబ్లీ, హైకోర్టు భవనాల పునాది పనులు దాదాపు పూర్తయ్యాయని, అధికారులు, ప్రజాప్రతినిధుల భవనాలు కూడా తుది దశకు చేరుకుంటున్నాయని వివరించారు. నవంబర్ 11 తర్వాత ప్రారంభోత్సవ కార్యక్రమాలు మొదలుపెడతామని వెల్లడించారు.
రాజధానిలో 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, 1,500 కిలోమీటర్ల లేఅవుట్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం సుమారు 35 వేల మంది కార్మికులు నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన ప్రకారం 2028 అక్టోబర్ నాటికి అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. మూడు గ్రామాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ కోసం చేపట్టిన భూసమీకరణ చాలావరకు పూర్తయిందని, వచ్చే నెలాఖరుకు 75 శాతానికి పైగా పూర్తవుతుందని అంచనా వేశారు. డిసెంబర్ నాటికి రహదారి నెట్‌వర్క్‌కు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ సిద్ధం చేయనుందని తెలిపారు. అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా సమాంతర రహదారి రూపకల్పన జరుగుతోందని, భూసమీకరణ కొనసాగుతున్న గ్రామాల్లో ప్రస్తుతానికి ఎన్నికలను వాయిదా వేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!