

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆసుపత్రిని సందర్శించారు. ప్రమాదం అనంతరం చేపట్టిన సహాయక, రక్షణ చర్యలను పరిశీలించిన ఆయన.. ఈ విభాగంలో చికిత్స పొందుతున్న శిశువులను సురక్షితంగా ఇతర వార్డులకు తరలించిన తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న శిశువులు, చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు.
శిశువులు, చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి వైద్యులను ఆదేశించారు. పిల్లల కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆసుపత్రిలో అగ్నిమాపక భద్రత, అత్యవసర పరిస్థితుల్లో చేపట్టిన చర్యలపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!